Vedic Tithi
VedicTithi

Stotram - Sacred Scripture in telugu

Ghantasala Bhagavad Gita

ఘణ్టశాల భగవద్గీతా

Ghantasala Bhagavad Gita

Stotram
Unknown
0 Verses
110%

ఘణ్టశాల భగవద్గీతా

001 ॥ పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయమ్ ।

వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతమ్ ॥

అద్వ్యైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీమ్ ।

అమ్బా! త్వామనుసన్దధామి భగవద్గీతే భవద్వేషిణీమ్ ॥

భగవద్గీత. మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరుగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నిఞ్చెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథియై నిలిచెను.

యుద్ధ రఙ్గమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తణ్డ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి, హృదయము ద్రవిఞ్చి,

002 ॥ న కాఙ్క్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ ।

కిం నో రాజ్యేన గోవిన్ద కిం భోగైర్జీవితేన వా ॥ (01:32)

స్వజనమును చమ్పుటకు ఇష్టపడక "నాకు విజయమూ వలదు, రాజ్య సుఖమూ వలదు" అని ధనుర్బాణములను క్రిన్ద వైచె. దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ,

003 ॥ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ।

గతాసూనగతాసూంశ్చ నానుశోచన్తి పణ్డితాః ॥ (02:11)

దుఃఖిమ్ప తగని వారిని గూర్చి దుఃఖిఞ్చుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములూ, శాశ్వతములూ అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖిమ్పరు.

004 ॥ దేహినోస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా ।

తథా దేహాన్తరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ॥ (02:13)

జీవునకు దేహమునన్దు బాల్యము, యవ్వనము, ముసలితనము యెట్లో, మరొక దేహమును పొన్దుట కూడా అట్లే. కనుకు ఈ విషయమున ధీరులు మోహము నొన్దరు.

005 ॥ వాసాంసి జీర్ణాని యథా విహాయ

నవాని గృహ్ణాతి నరోపరాణి ।

తథా శరీరాణి విహాయ జీర్ణాని

అన్యాని సంయాతి నవాని దేహీ ॥ (02:22)

మనుష్యుడు, ఎట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరిఞ్చునో, అట్లే, ఆత్మ - జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరిఞ్చుచున్నది.

006 ॥ నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః ।

న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః ॥ (02:23)

ఆత్మ నాశనములేనిది. ఆత్మను శస్త్రములు ఛేదిమ్పజాలవు, అగ్ని దహిమ్ప జాలదు. నీరు తడుపజాలదు. వాయువు ఆర్పివేయనూ సమర్థము కాదు. ఆత్మ నాశనములేనిది.

007 ॥ జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ।

తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి ॥ (02:27)

పుట్టిన వానికి మరణము తప్పదు. మరణిఞ్చిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకిమ్ప తగదు.

008 ॥ హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ ।

తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః ॥ (02:37)

యుద్ధమున మరణిఞ్చినచో వీర స్వర్గమును పొన్దెదవు. జయిఞ్చినచో రాజ్యమును భోగిన్తువు. కావున అర్జునా, యుద్ధమును చేయ కృతనిశ్చ్యుడవై లెమ్ము.

009 ॥ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ।

మా కర్మఫలహేతుర్భూః మా తే సఙ్గోస్త్వకర్మణి ॥ (02:47)

కర్మలను ఆచరిఞ్చుటయన్దే నీకు అధికారము కలదు కాని, వాని ఫలితము పైన లేదు. నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు. అట్లని, కర్మలను చేయుట మానరాదు.

010 ॥ దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః ।

వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ॥ (02:56)

దుఃఖములు కలిగినపుడు దిగులు చెన్దని వాడును, సుఖములు కలిగినపుడు స్పృహ కోల్పోని వాడును, రాగమూ, భయమూ, క్రోధమూ పోయినవాడును స్థిత ప్రజ్ఞుడని చెప్పబడును.

011 ॥ ధ్యాయతో విషయాన్ పుంసః సఙ్గస్తేషూపజాయతే ।

సఙ్గాత్-సఞ్జాయతే కామః కామాత్-క్రోధోభిజాయతే ॥ (02:62)

క్రోధాద్-భవతి సమ్మోహః సమ్మోహాత్-స్మృతివిభ్రమః ।

స్మృతిభ్రంశాద్-బుద్ధినాశో బుద్ధినాశాత్-ప్రణశ్యతి ॥ (02:63)

విషయ వాఞ్ఛలను గూర్చి సదా మననము చేయువానికి, వానియన్దనురాగ మధికమై, అది కామముగా మారి, చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశిఞ్చి, దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెన్దును.

012 ॥ ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి ।

స్థిత్వాస్యామన్తకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ॥ (02:72)

ఆత్మజ్ఞాన పూర్వక కర్మానుష్ఠానము, బ్రహ్మ ప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడక, సుఖైక స్వరూపమైన ఆత్మ ప్రాప్తిని చెన్దగలడు.

013 ॥ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ ।

జ్ఞానయోగేన సాఙ్ఖ్యానాం కర్మయోగేన యోగినామ్ ॥ (03:03)

అర్జునా! ఈ లోకములో ఆత్మానాత్మ వివేకముగల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధిగల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగు చున్నదని సృష్టి ఆదియన్దు నాచే చెప్పబడియున్నది.

014 ॥ అన్నాద్భవన్తి భూతాని పర్జన్యాదన్నసమ్భవః ।

యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ॥ (03:14)

అన్నమువలన జన్తుజాలము పుట్టును. వర్షము వలన అన్నము సమకూడును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సమ్భవము.

015 ॥ ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః ।

అఘాయురిన్ద్రియారామో మోఘం పార్థ స జీవతి ॥ (03:16)

పార్థా! నాచే నడుపబడు ఈ లోకము అను చక్రమునుబట్టి, ఎవడు అనుసరిమ్పడో వాడు ఇన్ద్రియలోలుడై పాప జీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్థుడు. జ్ఞాని కానివాడు సదా కర్మలనాచరిఞ్చుచునే యుణ్డవలెను.

016 ॥ యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః ।

స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ॥ (03:21)

ఉత్తములు అయినవారు దేని నాచరిన్తురో, దానినే ఇతరులును ఆచరిన్తురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా అఙ్గీకరిన్తురో, లోకమన్తయూ దానినే అనుసరిన్తును.

017 ॥ మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మచేతసా ।

నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ॥ (03:30)

అర్జునా! నీవొనర్చు సమస్త కర్మలనూ నాయన్దు సమర్పిఞ్చి, జ్ఞానముచే నిష్కాముడవై, అహఙ్కారము లేనివాడవై, సన్తాపమును వదలి యుద్ధమును చేయుము.

018 ॥ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ ।

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ॥ (03:35)

చక్కగా అనుష్ఠిమ్పబడిన పరధర్మముకన్న, గుణము లేనిదైననూ స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సమ్భవిఞ్చిననూ మేలే. పరధర్మము భయఙ్కరమైనది. ఆచరణకు అనుచితమైనది.

019 ॥ ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ ।

యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ॥ (03:38)

పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లే కామముచేత జ్ఞానము కప్పబడియున్నది.

020 ॥ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ।

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ॥ (04:07)

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।

ధర్మసంస్థాపనార్థాయ సమ్భవామి యుగే యుగే ॥ (04:08)

ఏ కాలమున ధరమమునకు హాని కలుగునో, అధరమము వృద్ధి నొన్దునో, ఆయా సమయములయన్దు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మసంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారమును దాల్చుచున్నాను.

021 ॥ వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః ।

బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః ॥ (04:10)

అనురాగమూ, భయమూ, క్రోధమూ వదిలి నాయన్దు మనస్సు లగ్నము చేసి ఆశ్రయిఞ్చిన సత్పురుషులు జ్ఞానయోగముచేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొన్దిరి.

022 ॥ యే యథా మాం ప్రపద్యన్తే తాంస్తథైవ భజామ్యహమ్ ।

మమ వర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః ॥ (04:11)

ఎవరెవరు యేయే విధముగా నన్ను తెలియగోరుచున్నారో, వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహిఞ్చుచున్నాను. కాని, ఏ ఒక్కనియన్దును అనురాగము కాని, ద్వేషము కాని లేదు.

023 ॥ యస్య సర్వే సమారమ్భాః కామసఙ్కల్పవర్జితాః ।

జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పణ్డితం బుధాః ॥ (04:19)

ఎవరి కర్మాచరణములు కామ సఙ్కల్పములు కావో, ఎవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టివానిని పణ్డితుడని విద్వాంసులు పల్కుదురు.

024 ॥ బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ ।

బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మ కర్మ సమాధినా ॥ (04:24)

యజ్ఞపాత్రము బ్రహ్మము. హోమద్రవ్యము బ్రహ్మము. అగ్ని బ్రహ్మము. హోమము చేయువాడు బ్రహ్మము. బ్రహ్మ కర్మ సమాధిచేత పొన్దనగు ఫలము కూడా బ్రహ్మమనియే తలఞ్చవలయును.

025 ॥ శ్రద్ధావాన్ల్లభతే జ్ఞానం తత్పరః సంయతేన్ద్రియః ।

జ్ఞానం లబ్ధ్వా పరాం శాన్తిమచిరేణాధిగచ్ఛతి ॥ (04:39)

శ్రద్ధ, ఇన్ద్రియనిగ్రహము గలవాడు జ్ఞానమును పొన్దుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొన్దును.

ఇది భగవద్గీత యన్దు బ్రహ్మవిద్యయను యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకుప దేశిఞ్చిన విషాద, సాఙ్ఖ్య, కర్మ, జ్ఞాన యోగములు సమాప్తము.


026 ॥ సన్న్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ ।

తయోస్తు కర్మసన్న్యాసాత్కర్మయోగో విశిష్యతే ॥ (05:02)

కర్మ సన్యాసములు రెణ్డునూ మోక్షసోపానములు. అన్దు కర్మ పరిత్యాగము కన్న కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది.

027 ॥ బ్రహ్మణ్యాధాయ కర్మాణి సఙ్గం త్యక్త్వా కరోతి యః ।

లిప్యతే న స పాపేన పద్మపత్రమివామ్భసా ॥ (05:10)

ఎవడు ఫలాపేక్ష కాఙ్క్షిమ్పక, బ్రహ్మార్పణముగా కర్మలనాచరిఞ్చునో, అతడు తామరాకున నీటిబిన్దువులు అన్టని రీతిగా పాపమున చిక్కుబడడు.

028 ॥ జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః ।

తేషామాదిత్యవజ్జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్ ॥ (05:16)

ఎవని అజ్ఞానము జ్ఞానముచేత నశిమ్పబడునో, అతనికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశిఞ్చి, పరమార్థ తత్వమును చూపును.

029 ॥ విద్యావినయసమ్పన్నే బ్రాహ్మణే గవి హస్తిని ।

శుని చైవ శ్వపాకే చ పణ్డితాః సమదర్శినః ॥ (05:18)

విద్యా వినయ సమ్పన్నుడగు బ్రాహ్మణునియన్దునూ, శునకమూ, శునకమామ్సము వణ్డుకొని తినువానియన్దునూ పణ్డితులు సమదృష్టి కలిగియున్దురు.

030 ॥ శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్ ।

కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః ॥ (05:23)

దేహత్యాగమునకు మున్దు యెవడు కామక్రోధాది అరిష్డ్వర్గముల జయిఞ్చునో, అట్టివాడు యోగి అనబడును.

031 ॥ యతేన్ద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః ।

విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః ॥ (05:28)

ఎవడు ఇన్ద్రియములను జయిఞ్చి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి, ప్రాణాపాన వాయువులను స్తమ్భిమ్పజేసి, మనస్సునూ, బుద్ధినీ స్వాధీనమొనర్చుకొని మోక్షాసక్తుడై ఉణ్డునో, అట్టివాడే ముక్తుడనబడును.

032 ॥ భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ ।

సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాన్తిమృచ్ఛతి ॥ (05:29)

సకల యజ్ఞ తపః ఫలములను పొన్దువానిగనూ, సకల ప్రపఞ్చ నియామకునిగనూ నన్ను గ్రహిఞ్చిన మహనీయుడు మోక్షమును పొన్దుచున్నాడు.

033 ॥ యం సన్న్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాణ్డవ ।

న హ్యసన్న్యస్తసఙ్కల్పో యోగీ భవతి కశ్చన ॥ (06:02)

అర్జునా! సన్యాసమని దేనినదురో, దానినే కర్మయోగమనియూ అన్దురు. అట్టి యెడ సఙ్కల్పత్యాగ మొనర్పనివాడు యోగి కాజాలడు.

034 ॥ యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు ।

యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ॥ (06:17)

యుక్తాహార విహారాదులు, కర్మాచరణము గలవానికి ఆత్మసమ్యమన యోగము లభ్యము.

035 ॥ యథా దీపో నివాతస్థో నేఙ్గతే సోపమా స్మృతా ।

యోగినో యతచిత్తస్య యుఞ్జతో యోగమాత్మనః ॥ (06:19)

గాలిలేనిచోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశిఞ్చులాగుననే, మనో నిగ్రహముకల్గి, ఆత్మయోగ మభ్యసిఞ్చినవాని చిత్తము నిశ్చలముగా నుణ్డును.

036 ॥ సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ।

ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ॥ (06:29)

సకల భూతములయన్దూ సమదృష్టి కలిగినవాడు, అన్ని భూతములు తన యన్దునూ, తనను అన్ని భూతములయన్దునూ చూచుచుణ్డును.

037 ॥ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ ।

అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే ॥ (06:35)

అర్జునా! ఎట్టివానికైననూ మనస్సును నిశ్చలముగా నిల్పుట దుస్సాధ్యమే. అయిననూ, దానిని అభ్యాస, వైరాగ్యములచేత నిరోధిమ్పవచ్చును.

038 ॥ యోగినామపి సర్వేషాం మద్గతేనాన్తరాత్మనా ।

శ్రద్ధావాన్భజతే యో మాం స మే యుక్తతమో మతః ॥ (06:47)

అర్జునా! పరిపూర్ణ విశ్వాసముతో నన్నాశ్రయిఞ్చి, వినయముతో ఎవరు సేవిఞ్చి భజిన్తురో వారు సమస్త యోగులలో ఉత్తములు.

039 ॥ మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే ।

యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః ॥ (07:03)

వేలకొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొర్’అకు ప్రయత్నిఞ్చును. అట్లు ప్రయత్నిఞ్చిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యదార్థముగా తెలుసు కొనగలుగుచున్నాడు.

040 ॥ భూమిరాపోనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ ।

అహఙ్కార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా ॥ (07:04)

భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహఙ్కారము అని నా మాయాశక్తి ఎనిమిది విధములైన బేధములతో ఒప్పి యున్నదని గ్రహిమ్పుము.

041 ॥ మత్తః పరతరం నాన్యత్కిఞ్చిదస్తి ధనఞ్జయ ।

మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ॥ (07:07)

అర్జునా! నా కన్న గొప్పవాడుగాని, గొప్పవస్తువుగాని మరేదియూ ప్రపఞ్చమున లేదు. సూత్రమున మణులు గ్రుచ్చబడినట్లు యీ జగమన్తయూ నాయన్దు నిక్షిప్తమై ఉన్నది.

042 ॥ పుణ్యో గన్ధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ ।

జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు ॥ (07:09)

భూమియన్దు సుగన్ధము, అగ్నియన్దు తేజము, యెల్ల భూతములయన్దు ఆయువు, తపస్వులయన్దు తపస్సు నేనుగా నెరుగుము.

043 ॥ దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।

మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే ॥ (07:14)

పార్థా! త్రిగుణాత్మకము, దైవ సమ్బన్ధము అగు నా మాయ అతిక్రమిమ్ప రానిది. కాని, నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభసాధ్యము.

044 ॥ చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినోర్జున ।

ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ ॥ (07:16)

ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థకాములు, జ్ఞానులు అను నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్నాశ్రయిఞ్చుచున్నారు.

045 ॥ బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్మాం ప్రపద్యతే ।

వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ॥ (07:19)

జ్ఞాన సమ్పన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట, విజ్ఞానియై నన్ను శరణము నొన్దుచున్నాడు.

046 ॥ అన్తకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరమ్ ।

యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ॥ (08:05)

ఎవడు అన్త్యకాలమున నన్ను స్మరిఞ్చుచూ శరీరమును వదలుచున్నాడో, వాడు నన్నే చెన్దుచున్నాడు.

047 ॥ అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా ।

పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచిన్తయన్ ॥ (08:08)

కవిం పురాణమనుశాసితారం

అణోరణీయంసమనుస్మరేద్యః ।

సర్వస్య ధాతారమచిన్త్యరూపం

ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ॥ (08:09)

అర్జునా! ఎవడు అభ్యాసయోగముతో, ఏకాగ్ర చిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరిఞ్చునో, అట్టివాడు ఆ పరమపురుషునే చెన్దుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు; పురాణ పురుషుడు; ప్రపఞ్చమునకు శిక్షకుడు; అణువు కన్నా అణువు; అనూహ్యమైన రూపము కలవాడు; సూర్య కాన్తి తేజోమయుడు; అజ్ఞానాన్ధకారమునకన్న ఇతరుడు.

048 ॥ అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిమ్ ।

యం ప్రాప్య న నివర్తన్తే తద్ధామ పరమం మమ ॥ (08:21)

ఇన్ద్రియ గోచరము కాని పరబ్రహ్మపదము శాశ్వతమైనది. పునర్జన్మ రహితమైన ఆ ఉత్తమపదమే పరమపదము.

049 ॥ శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే ।

ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పునః ॥ (08:26)

జగత్తునన్దు శుక్ల కృష్ణము లనెడి రెణ్డు మార్గములు నిత్యములుగా ఉన్నవి. అన్దు మొదటి మార్గము వలన జన్మరాహిత్యము, రెణ్డవ దానివలన పునర్జన్మము కలుగు చున్నవి.

050 ॥ వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ

దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ ।

అత్యేతి తత్సర్వమిదం విదిత్వా

యోగీ పరం స్థానముపైతి చాద్యమ్ ॥ (08:28)

యోగియైనవాడు వేదాధ్యయనము వలన, యజ్ఞతపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశిమ్పక, ఉత్తమ పదమైన బ్రహ్మపదమును పొన్దగలడు.

051 ॥ సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్ ।

కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ ॥ (09:07)

పార్థా! ప్రలయకాలమున సకల ప్రాణులును నా యన్దు లీనమగుచున్నవి. మరల కల్పాది యన్దు సకల ప్రాణులనూ నేనే సృష్టిఞ్చు చున్నాను.

052 ॥ అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే ।

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ॥ (09:22)

ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయన్దు నన్నే ధ్యానిఞ్చు చుణ్డునో అట్టివాని యోగక్షేమములు నేనే వహిఞ్చు చున్నాను.

053 ॥ పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి ।

తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః ॥ (09:26)

ఎవడు భక్తితో నాకు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదక మైనను ఫలాపేక్ష రహితముగా సమర్పిఞ్చుచున్నాడో, అట్టివానిని నేను ప్రీతితో స్వీకరిఞ్చుచున్నాను.

054 ॥ మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు ।

మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః ॥ (09:34)

పార్థా! నా యన్దు మనస్సు లగ్నము చేసి యెల్ల కాలములయన్దు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడవై పూజిఞ్చితివేని నన్నే పొన్దగలవు.

ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకుప దేశిఞ్చిన కర్మసన్యాస, ఆత్మసంయమ, విజ్ఞాన, అక్షర పరబ్రహ్మ, రాజ విద్యా రాజగుహ్య యోగములు సమాప్తము.


055 ॥ మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా ।

మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః ॥ (10:06)

కశ్యపాది మహర్షి సప్తకము, సనక సనన్దనాదులు, స్వయమ్భూవాది మనువులు నా వలననే జన్మిఞ్చిరి. పిమ్మట వారి వలన ఎల్ల లోకములన్దలి సమస్త భూతములును జన్మిఞ్చెను.

056 ॥ మచ్చిత్తా మద్గతప్రాణా బోధయన్తః పరస్పరమ్ ।

కథయన్తశ్చ మాం నిత్యం తుష్యన్తి చ రమన్తి చ ॥ (10:09)

పణ్డితులు నాయన్దు చిత్తముగలవారై నా యన్దే తమ ప్రాణములుఞ్చి నా మహిమానుభావ మెరిఙ్గి ఒకరికొకరు ఉపదేశములు గావిఞ్చుకొఞ్చు బ్రహ్మా నన్దమును అనుభవిఞ్చుచున్నారు.

057 ॥ అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః ।

అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవ చ ॥ (10:20)

సమస్త భూతముల మనస్సులన్దున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి, పెమ్పు, నాశములకు నేనే కారకుడను.

058 ॥ వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ।

ఇన్ద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా ॥ (10:22)

వేదములలో సామవేదము, దేవతలలో దేవేన్ద్రుడు, ఇన్ద్రియములలో మనస్సు, ప్రాణులన్దరి బుద్ధి నేనే.

059 ॥ ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ ।

మృగాణాం చ మృగేన్ద్రోహం వైనతేయశ్చ పక్షిణామ్ ॥ (10:30)

రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మన్తుడు నేనే.

060 ॥ యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా ।

తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంశసమ్భవమ్ ॥ (10:41)

లోకమునన్దు ఐశ్వర్య యుక్తమై, పరాక్రమ యుక్తమై, కాన్తి యుక్తమైన సమస్త వస్తువులు నా తేజో భాగము వలననే సమ్ప్రాప్తమగును.

061 ॥ పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః ।

నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ ॥ (11:05)

పార్థా! దివ్యములై, నానా విధములై, అనేక వర్ణములై అనేక విశేషములగు నా సస్వరూపమును కన్నులారా దర్శిమ్పుము.

062 ॥ పశ్యామి దేవాంస్తవ దేవ దేహే

సర్వాంస్తథా భూతవిశేషసఙ్ఘాన్ ।

బ్రహ్మాణమీశం కమలాసనస్థం

ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ ॥ (11:15)

అనేకబాహూదరవక్త్రనేత్రం

పశ్యామి త్వాం సర్వతోనన్తరూపమ్ ।

నాన్తం న మధ్యం న పునస్తవాదిం

పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ॥ (11:16)

దంష్ట్రాకరాలాని చ తే ముఖాని

దృష్ట్వైవ కాలానలసన్నిభాని ।

దిశో న జానే న లభే చ శర్మ

ప్రసీద దేవేశ జగన్నివాస ॥ (11:25)

దేవా! ఎల్ల దేవతలూ, ఎల్ల ప్రాణులూ, బ్రహ్మాదులూ, ఋషీశ్వరులూ, వాసుకీ మొదలగుగా గల సర్పములూ నీయన్దు నాకు గోచరమగుచున్నవి.

ఈశ్వరా! నీ విశ్వరూపము అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది. అట్లైయూ నీ ఆకారమున ఆద్యన్త మధ్యములను గుర్తిమ్ప జాల కున్నాను. కోరలచే భయఙ్కరమై ప్రలయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుటవలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో! నాయన్దు దయ యుఞ్చి నాకు ప్రసన్నుడవు గమ్ము. కృష్ణా! ప్రసన్నుడవు గమ్ము.

అర్జునా!

063 ॥ కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో

లోకాంసమాహర్తుమిహ ప్రవృత్తః ।

ఋతేపి త్వాం న భవిష్యన్తి సర్వే

యేవస్థితాః ప్రత్యనీకేషు యోధాః ॥ (11:32)

అర్జునా! ఈ ప్రపఞ్చమునెల్ల నశిమ్పజేయు బలిష్ఠమైన కాల స్వరూపుడను నేనే. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చమ్పకున్ననూ - బ్రతుక గలవారిన్దెవ్వరునూ లేరు.

064 ॥ ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ

కర్ణం తథాన్యానపి యోధవీరాన్ ।

మయా హతాంస్త్వం జహి మావ్యథిష్ఠా

యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ ॥ (11:34)

ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రధ కర్ణాధి యోధ వీరులు నాచే సంహరిమ్పబడిరి. ఇక మిగిలిన శతృ వీరులను నీవు సంహరిమ్పుము.

065 ॥ కిరీటినం గదినం చక్రహస్తమ్ ।

ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ ।

తేనైవ రూపేణ చతుర్భుజేన ।

సహస్రబాహో భవ విశ్వమూర్తే ॥ (11:46)

అనేక భుజములుగల నీ విశ్వరూపమును ఉపసంహరిఞ్చి కిరీటము, గద, చక్రము ధరిఞ్చిన నీ సహజ సున్దరమైన స్వరూపమును దర్శిమ్పగోరు చున్నాను కృష్ణా!

066 ॥ సుదుర్దర్శమిదం రూపం దృష్ట్వానసి యన్మమ ।

దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాఙ్క్షిణః ॥ (11:52)

అర్జునా! నీవు దర్శిఞ్చిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శిమ్ప దేవతలన్దరునూ సదా కోరుచున్దురు.

067 ॥ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే ।

శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః (12:02)

ఎవరు నాయన్దే మనస్సు లగ్నము చేసి, శ్ర్ద్ధాభక్తులతో నన్ను ధ్యానిఞ్చు చున్నారో, అట్టివారు అత్యన్తమూ నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు.

068 ॥ శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్జ్ఞానాద్-ధ్యానం విశిష్యతే ।

ధ్యానాత్కర్మఫలత్యాగస్త్యాగాచ్ఛాన్తిరనన్తరమ్ ॥ (12:12)

అభ్యాసయోగముకన్న జ్ఞానము, జ్ఞానము కన్న ధ్యానము, దానికన్న కర్మ ఫలత్యాగమూ శ్రేష్ఠము. అట్టి త్యాగమువల్ల సంసార బన్ధనము తొలగి మోక్షప్రాప్తి సన్భవిఞ్చుచున్నది.

069 ॥ అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః ।

సర్వారమ్భపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః ॥ (12:16)

ఎవడు కోరికలు లేనివాడై, పవిత్రుడై, పక్షపాత రహితుడై భయమును వీడి కర్మఫ్ల త్యాగియై నాకు భక్తుడగునో అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు.

070 ॥ సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః ।

శీతోష్ణసుఖదుఃఖేషు సమః సఙ్గవివర్జితః ॥ (12:18)

తుల్యనిన్దాస్తుతిర్మౌనీ సన్తుష్టో యేన కేనచిత్ ।

అనికేతః స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నరః ॥ (12:19)

శత్రుమిత్రులయన్దును, మానావ మానములయన్దును, శీతోష్ణ సుఖ దుఃఖాదులయన్దును సమబుద్ధి కలిగి, సఙ్గరహితుడై, నిత్య సన్తుష్టుడై, చలిఞ్చని మనస్సు కలవాడై, నాయన్దు భక్తి ప్రపత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు.

071 ॥ ఇదం శరీరం కౌన్తేయ క్షేత్రమిత్యభిధీయతే ।

ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ॥ (13:02)

అర్జునా! దేహము క్షేత్రమనియూ, దేహమునెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియూ పెద్దలు చెప్పుదురు.

072 ॥ అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్ ।

ఏతజ్జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోన్యథా ॥ (13:12)

ఆత్మ జ్ఞానమునన్దు మనస్సు లగ్నము చేయుట, మౌక్షప్రాప్తి యన్దు దృష్టి కలిగియుణ్డుట జ్ఞాన మార్గములనైయూ, వానికి ఇతరములైనవి అజ్ఞానములనియూ చెప్పబడును.

073 ॥ కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే ।

పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే ॥ (13:21)

ప్రకృతిని "మాయ" యని యన్దురు. అది శరీర సుఖదుఃఖాదులను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు ఆ సుఖ దుఃఖములను అనుభవిఞ్చుచుణ్డును.

074 ॥ సమం సర్వేషు భూతేషు తిష్ఠన్తం పరమేశ్వరమ్ ।

వినశ్యత్స్వవినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి ॥ (13:28)

శరీరము నశిఞ్చిననూ తాను సశిమ్పక యెవడు సమస్త భూతములన్దున్న పరమేశ్వరుని చూచునో వాడే యెరిగినవాడు.

075 ॥ అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః ।

శరీరస్థోపి కౌన్తేయ న కరోతి న లిప్యతే ॥ (13:32)

అర్జునా! గుణ నాశన రహితుడైనవాడు పరమాత్మ. అట్టి పరమాత్మ దేహాన్త ర్గతుడయ్యునూ కర్మల నాచరిఞ్చువాడు కాడు.

076 ॥ యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః ।

క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ॥ (13:34)

పార్థా! సూర్యుడొక్కడే యెల్ల జగత్తులనూ ఏ విధముగా ప్రకాశిమ్పజేయుచున్నాడో ఆ విధముగనే క్షేత్రజ్ఞుడు యెల్ల దేహములనూ ప్రకాశిమ్పజేయుచున్నాడు.

ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమన్దు శ్రీకృష్ణుడు అర్జునునకుప దేశిఞ్చిన విభూతి యోగము, విశ్వరూప సన్దర్శన యోగము, భక్తి యోగము, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములు సమాప్తము.


077 ॥ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ ।

యజ్జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః ॥ (14:01)

జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీశ్వరులు మోక్ష్మును పొన్దిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశిఞ్చుచున్నాను.

078 ॥ సర్వయోనిషు కౌన్తేయ మూర్తయః సమ్భవన్తి యాః ।

తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా ॥ (14:04)

అర్జునా! ప్రపఞ్చమున జన్మిఞ్చు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వన్టిది. నేను తణ్డ్రి వన్టివాడను.

079 ॥ తత్ర సత్త్వం నిర్మలత్వాత్ప్రకాశకమనామయమ్ ।

సుఖసఙ్గేన బధ్నాతి జ్ఞానసఙ్గేన చానఘ ॥ (14:06)

అర్జునా! త్రిగుణములలో సత్త్వగుణము నిర్మలమగుటన్జేసి సుఖ జ్ఞానాభి లాషలచేత ఆత్మను దేహమునన్దు బన్ధిఞ్చుచున్నది.

080 ॥ రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసఙ్గసముద్భవమ్ ।

తన్నిబధ్నాతి కౌన్తేయ కర్మసఙ్గేన దేహినమ్ ॥ (14:07)

ఓ కౌన్తేయా! రజోగుణము కోరికలయన్దు అభిమానమూ, అనురాగమూ పుట్టిఞ్చి ఆత్మను బన్ధిఞ్చుచున్నది.

081 ॥ తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ ।

ప్రమాదాలస్యనిద్రాభిస్తన్నిబధ్నాతి భారత ॥ (14:08)

అర్జునా! అజ్ఞానమువలన పుట్టునది తమోగుణము. అది సర్వ ప్రాణులనూ మోహిమ్పజేయునది. ఆ గుణము మనుజుని ఆలస్యముతోనూ, అజాగ్రత్తతోనూ, నిద్ర తోనూ బద్ధుని చేయును.

082 ॥ మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః ।

సర్వారమ్భపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే ॥ (14:25)

మానావ మానములయన్దు, శత్రుమిత్రులయన్దు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతుడన్దురు.

083 ॥ ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।

ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ॥ (15:01)

బ్రహ్మమే మూలముగా, నికృష్ణమైన అహఙ్కారము కొమ్మలుగాగల అశ్వత్థ వృక్షము అనాది అయినది. అట్టి సంసార వృక్ష్మునకు వేదములు ఆకులువన్టివి. అట్టి దాని నెరిఙ్గినవాడే వేదార్థ సార మెరిఙ్గినవాడు.

084 ॥ న తద్భాసయతే సూర్యో న శశాఙ్కో న పావకః ।

యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ ॥ (15:06)

పునరావృత్తి రహితమైన మోక్షపథము, సూర్య చన్ద్రాగ్నుల ప్రకాశమున కతీతమై, నా ఉత్తమ పథమై యున్నది.

085 ॥ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ।

ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ॥ (15:14)

దేహులన్దు జఠరాగ్ని స్వరూపుడనై వారు భుజిఞ్చు భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను.

086 ॥ తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా ।

భవన్తి సమ్పదం దైవీమభిజాతస్య భారత ॥ (16:03)

దమ్భో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ ।

అజ్ఞానం చాభిజాతస్య పార్థ సమ్పదమాసురీమ్ ॥ (16:04)

పార్థా! సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరుల వఞ్చిమ్పకుణ్డుట, కావరము లేకయుణ్డుట, మొదలగు గుణములు దైవాంశ సమ్భూతులకుణ్డును. అట్లే, దమ్బము, గర్వము, అభిమానము, క్రోధము, కఠినపు మాటలాడుట, అవివేకము మొదలగు గుణములు రాక్షసాంశ సమ్భూతులకుణ్డును.

087 ॥ త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః ।

కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్ ॥ (16:21)

కామ, క్రోధ, లోభములు ఆత్మను నాశనము చేయును. అవి నరక ప్రాప్తికి హేతువులు కావున వానిని వదిలి వేయ వలయును.

088 ॥ యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః ।

న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ ॥ (16:23)

శాస్త్ర విషయముల ననుసరిమ్పక ఇచ్ఛా మార్గమున ప్రవర్తిఞ్చువాడు సుఖ సిద్ధులను పొన్దజాలడు. పరమపదము నన్దజాలడు.

089 ॥ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా ।

సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు ॥ (17:02)

జీవులకు గల శ్రద్ధ పూర్వ జన్మ వాసనా బలము వలన లభ్యము. అది రాజసము, సాత్త్వికము, తామసములని మూడు విధములగా ఉన్నది.

090 ॥ యజన్తే సాత్త్వికా దేవాన్యక్షరక్షాంసి రాజసాః ।

ప్రేతాన్భూతగణాంశ్చాన్యే యజన్తే తామసా జనాః ॥ (17:04)

సత్త్వగుణులు దేవతలను, రజోగుణులు యక్ష రాక్షసులను, తమోగుణులు భూత ప్రేత గణమ్బులను శ్రద్ధా భక్తులతో పూజిఞ్చుదురు.

091 ॥ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ ।

స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే ॥ (17:15)

ఇతరుల మనస్సుల నొప్పిమ్పనిదియూ, ప్రియమూ, హితములతో కూడిన సత్య భాషణమూ, వేదాధ్యన మొనర్చుట వాచక తపస్సని చెప్పబడును.

092 ॥ కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః ।

సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః ॥ (18:02)

జ్యోతిష్ఠోమాది కర్మల నాచరిమ్పకుణ్డుట సన్యాసమనియూ, కర్మఫలము

యీశ్వరార్పణ మొనర్చుట త్యాగమనియూ పెద్దలు చెప్పుదురు.

093 ॥ అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్ ।

భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్న్యాసినాం క్వచిత్ ॥ (18:12)

కర్మఫలములు ప్రియములూ, అప్రియములూ, ప్రియాతిప్రియములూ అని మూడు విధములు. కర్మఫలమునలు కోరినవారు జన్మాన్తరమన్దు ఆ ఫలములను పొన్దుచున్నారు. కోరనివారు ఆ ఫలములను జన్మాన్తరమున పొన్దజాల కున్నారు.

094 ॥ ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే ।

బన్ధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ ॥ (18:30)

అర్జునా! కర్మ మోక్ష మార్గముల, కర్తవ్య భయాభయముల, బన్ధ మోక్షముల ఏ జ్ఞానమెరుగుచున్నదో అది సత్త్వగుణ సముద్భవమని ఎరుగుము.

095 ॥ ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి ।

భ్రామయంసర్వభూతాని యన్త్రారూఢాని మాయయా ॥ (18:61)

ఈశ్వరుడు యెల్ల భూతములకు నియామకుడై, ప్రాణుల హృదయమన్దున్నవాడై, జన్త్రగాడు బొమ్మలనాడిఞ్చు రీతిగా ప్రాణుల భ్రమిమ్పజేయుచున్నాడు.

096 ॥ సర్వధర్మామ్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ।

అహం త్వాం సర్వపాపేభ్యో మోక్ష్యయిష్యామి మా శుచః ॥ (18:66)

సమస్త కర్మలను నాకర్పిఞ్చి, నన్నే శరణు బొన్దిన, ఎల్ల పాపములనుణ్డి నిన్ను విముక్తుని గావిన్తును. నీవు చిన్తిమ్పకుము.

097 ॥ య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి ।

భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః ॥ (18:68)

ఎవడు పరమోత్కృష్టమైన, పరమ రహస్యమైన యీ గీతాశాస్త్రమును నా భక్తుల కుపదేశము చేయుచున్నాడో, వాడు మోక్షమున కర్హుడు.

098 ॥ కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా ।

కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రనష్టస్తే ధనఞ్జయ ॥ (18:72)

ధనన్జయా! పరమ గోప్యమైన యీ గీతా శాస్త్రమును చక్కగా విన్టివా? నీ యజ్ఞాన జనితమైన అవివేకము నశిఞ్చినదా?

కృష్ణా!

099 ॥ నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత ।

స్థితోస్మి గతసన్దేహః కరిష్యే వచనం తవ ॥ (18:73)

అచ్యుతా! నా అవివేకము నీ దయ వలన తొలగెను. నాకు సుజ్ఞానము లభిఞ్చినది. నాకు సన్దేహములన్నియూ తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహిఞ్చెదను.

100 ॥ యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।

తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ ॥ (18:78)

యోగీశ్వరుడగు శ్రీకృష్ణుడు, ధనుర్ధారియగు అర్జునుడు యెచటనున్దురో అచట సమ్పద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతియుణ్డును.

గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ ।

విష్ణొః పదమవాప్నోతి భయ శోకాది వర్జితః ॥

గీతాశాస్త్రమును ఎవరు పఠిన్తురో వారు భయ శోకాది వర్జితులై విష్ణు సాయుజ్యమును పొన్దుదురు.

ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమన్దు శ్రీకృష్ణుడు అర్జునునకుపదేశిఞ్చిన గుణత్రయ విభాగ, పురుషోత్తమ ప్రాప్తి, దేవాసుర సమ్పద్విభాగ, శ్రద్ధాత్రయ విభాగ, మోక్షసన్యాస యోగములు సర్వమూ సమాప్తము.

ఓం సర్వేజనాః సుఖినో భవన్తు

సమస్త సన్మగలాని భవన్తు

అసతోమా సద్గమయ

తమసోమా జ్యోతిర్గమయ

మృత్యోర్మా అమృతఙ్గమయ

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః

About This Stotram

Overview

The Ghantasala Bhagavad Gita is a presentation of the Bhagavad Gita associated with the Ghantasala tradition, a cultural and scholarly heritage of the Andhra region of South India. The Bhagavad Gita is a Sanskrit dialogue between Lord Krishna and Arjuna, embedded in the Bhishma Parva of the Mahabharata, and traditionally attributed to the sage Vyasa. The text is one of the most central scriptures of Hindu philosophy.

What are the benefits of chanting Ghantasala Bhagavad Gita?

  • Attainment of spiritual knowledge and clarity on dharma
  • Understanding the teachings of karma yoga, jnana yoga, and bhakti yoga
  • Liberation from attachment and the cycle of birth and death
  • Guidance on ethical conduct and duty

When is the best time to recite this?

Morning and evening are appropriate times for recitation or study. It is particularly recited during festivals honoring Lord Krishna, such as Janmashtami, and during Gita Jayanti, which marks the day the Gita was spoken.

What is the historical and traditional background?

The Bhagavad Gita as a text is embedded in the Mahabharata, which took shape over several centuries, with the core narrative generally dated between the 4th century BCE and the 4th century CE. Vyasa is the traditional author. The Ghantasala association likely refers to a specific regional edition, commentary, or recitation tradition originating from or popularized in the Ghantasala area of Andhra Pradesh. Such regional recitation traditions have long played a role in transmitting major Sanskrit texts to local devotional audiences.

Available scripts

This text is available in 14 scripts: devanagari, tamil, telugu, kannada, malayalam, gujarati, bengali, iast, gurmukhi, oriya, assamese, sinhala, itrans, hk. Use the script selector above to switch between them.

Related Texts

  • Gita Chalisa — a Hindi chalisa that distills the Bhagavad Gita's teachings in devotional verse
  • Vishnu Sahasranama — a 1000-name hymn to Vishnu, also embedded in the Mahabharata